నోవెల్ కరోనా వైరస్‌ను తొలి సారి గుర్తించిన డాక్టర్ లీ వెన్‌లియాంగ్.. ఆ వైరస్ వల్లే మృతిచెందిన విషయం తెలిసిందే. వుహాన్ నగరంలో కంటి శస్త్రచికిత్స వైద్యుడిగా పనిచేస్తున్న లీ వెన్‌లియాంగ్.. తొలిసారి కొత్త కరోనా వైరస్‌ను గుర్తించాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని ఆయన వీచాట్‌లో తన మిత్రులతో షేర్ చేశాడు. అయితే అనవసరంగా జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆ డాక్టర్‌ను పోలీసులు మందలించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అతనిపై పోలీసులు కేసు కూడా పెట్టారు.
వుహాన్ పోలీసులు ఇప్పుడు ఆ డాక్టర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. సదురు పోలీసులు సరైన రీతిలో విచారణ చేపట్టలేదని పోలీసు శాఖ తన లేఖలో తెలిపింది. కుటుంబసభ్యులకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. 34 ఏళ్ల డాక్టర్ లీ.. గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన కరోనా వైరస్ గురించి తొలిసారి వీచాట్‌లో పేర్కొన్నాడు. సార్స్ తరహాలో ఆ వైరస్ ఉన్నట్లు అతను అనుమానాలు వ్యక్తం చేశాడు. నాలుగు రోజుల తర్వాత జాంగ్‌నాన్‌లూ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే వుహాన్ నగరం కరోనా వ్యాప్తికి కేంద్రబిందువుగా మారింది.